వీధిశూల అని వీధి పోటు అని పిలువబడే వీటి విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి.
స్థలం తీసుకునే తరుణంలోనే ఈ వీధిపోట్లును గుర్తించాలి.
వీధి ఫలితాలు తెల్సుకుని స్థలాన్ని కొనడం చేయాలి.
మన స్థలానికి ఎదురుగా వీధి ఉంటే దానిని వీధిపోటు అంటాము.
ఏ వీధిపోటు ఎలాంటి ఫలితాలనిస్తుందో సవివరంగా తెల్సుకుందాం.
తూర్పు ఈశాన్య వీధిపోటు :
తూర్పు ఈశాన్య వీధిపోటు ఆ గృహంలో నివశించే పురుషులపై ప్రభావం చూపుతుంది.
ఇంటా బయటా వీరిదే పైచేయి అన్నట్లుంటుంది వీరి పరిస్థితి.
ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మంచి గుర్తింపు, మన్నన వీరికి లభిస్తాయి.
సమాజంలో మంచి గౌరవ ప్రతిష్ఠలు పొందగల్గుతారు.
ఇది శుభప్రదమైన వీధిశూలే.
ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలంలో గృహ నిర్మాణం ఆమోద యోగ్యమే.
ఉత్తర ఈశాన్యం వీధిపోటు :
ఉత్తర ఈశాన్యం వీధిపోటు... ఎంతో శుభప్రదం, లాభదాయకం, ఇంట సిరులు కురిపించే వీధిపోటు ఇది.
ఈ ఇంట ధనమే కాదు, ఆరోగ్యం కూడా దండిగా ఉంటుంది.
ఈ ఇంటో నివశించే దంపతులు ఎంతో అన్యోన్యంగా దాంపత్యాన్ని సాగిస్తారు.
కుటుంబంలో సభ్యుల నడుమ మమతానురాగాలు పెనవేసుకుంటాయి.
ఇంటా బయటా స్త్రీ పురుష బేధం లేకుండా ఈ ఇంట నివసించే వారికి మంచి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి.
ఇలా ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఉన్న స్థలం లభిస్తే... వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించి అయినా తక్షణం కొనేసుకోండి.
ఉత్తర వాయువ్యం వీధిపోటు :
ఈ వీధిపోటు శుభదాయకం కాదు. ముఖ్యంగా ఈ వీధిపోటు ఆ ఇంట నివశించే మహిళలపై ప్రభావం చూపుతుంది. మనశ్శాంతిగా ఉండలేరు. సంసారంలో సుఖ సౌఖ్యాలు కరువవుతాయి. ఆడపిల్లలకు చదువు అబ్బదు. వివాహాల సమయంలో కూడా ఎన్నోచిక్కులు ఎదురవుతాయి. ఇలాంటి స్థలాన్ని కానీ, ఇంటిని కానీ కొనకూడదు.
పశ్చిమ వాయువ్యం వీధిపోటు :
పశ్చిమ వాయువ్య దిశలో ఇంటికి ఎదురుగా వీధి ఉన్నట్లయితే దాన్ని పశ్చిమ వాయువ్య వీధిపోటుగా పరిగణించాలి.ఈ వీధిపోటు ఉన్న స్థలం కొనదగినది. గృహ నిర్మాణం చేయదగినది.
ఈ వీధిపోటు పురుషులపై సత్ప్రభావం చూపుతుంది. రాజపూజ్యం, గౌరవ ప్రతిష్ఠలు, ఎల్లెడలా ఆధిపత్యం, రాజకీయాలలో నాయకులుగాను త్వరగా ఎదుగుతారు.
మట్టి ముట్లుకున్నా బంగారం అన్నట్లుంటుంది ఈ ఇంటి నివశించే పురుషుల పరిస్థితి.ఇలాంటి స్థలాన్ని రెండో ఆలోచన లేకుండా కొనేయాలి.
పశ్చిమ నైఋతి వీధిపోటు :
ఈ వీధిపోటు ఆ ఇంట నివశించే పురుషులపై ప్రధానంగా ప్రభావం చూపుతుంది. జీవితం గొర్రెకు తోక బెత్తెడే అన్నట్లుంటుంది. కష్టానికి తగ్గ ఫలితం లభించదు.
నిరాశా నిస్పృహలకు గురిచేస్తుంది. మనశ్శాంతిని హరిస్తుంది. జీవితం ఆపజయాల జాతర అన్నట్లు మారుతుంది. ఆపవాదులు, నిందలు, ఈ ఇంట మగవారిని బాధించి వేధిస్తాయి.
విజయం చేతికందినట్లే అంది పరాజయాన్ని మిగులుస్తుంది. మగవారి పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీరే అలోచించండి.
దక్షిణ నైఋతి వీధిపోటు :
దక్షిణ నైఋతికి ఎదురుగా వీధి ఉంటే.. దాన్ని దక్షిణ నైఋతి వీధిపోటుగా భావించాలి. ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలాన్ని, ఇంటిని కొనకూడదు.
ప్రత్యేకించి ఈ వీధిపోటు ప్రభావవం ఆ ఇంట గృహిణిపైన ఉంటుంది. కాపురం కలతల కల్లోలంగా ఉంటుంది. దాంపత్యంలో అనురాగం కొరవడుతుంది.
ఇంటి యజమానురాలి ఆరోగ్యం బాగుండదు. ఏ కార్యం తలపెట్టినా ఎదురుతిరుగుతుంది. మనసు ఎప్పుడూ కల్లోల సాగరంలా ఉంటుంది.
ఊరకే కృంగిపోతుంటారు. ఇంటా బయటా అవమానాలే.
దక్షిణ ఆగ్నేయ వీధిపోటు :
ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలాన్ని, ఇంటినీ నిశ్చింతగా కొనవచ్చు. ఈ ఇంట నివసించేవారు.
ఆనందప్రదమైన జీవితాన్ని అనుభవిస్తారు. డబ్బుకు కొదవే ఉండదు. అలానే ఈ ఇంట నివసించే వారికి ఆరోగ్యానికీ కొదవ ఉండదు. ఎప్పుడూ ఈ ఇల్లు ధన ధాన్యాలతో తులతూగుతుంటుంది.
బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది. ఈ ఇంట నివశించే ఆడవారు, ఆడపిల్లల చదువుల్లో సరస్వతుల్లా రాణిస్తారు. మంచి ఉద్యోగాలను పొందగల్గుతారు. మంచి ఖ్యాతి విఖ్యాతులు సొంతం చేసుకుంటారు.
తూర్పు ఆగ్నేయ వీధిపోటు :
తూర్పు ఆగ్నేయ దిశలో వీధిపోటు ఉందంటే... ఆ ఇంట నివశించే వారి జీవితం... నిత్యం అల్లకల్లోలం అన్నట్లుంటుంది.
జయాలు శూన్యం. అపజయాలు అపారం. జీవితంలో కష్టాలు కోకొల్లలు. సుఖాలు కోటి దివిటీలతో వెతికినా కన్పించవు. మనసు సునామీ నాటి సంద్రంటా ఉంటుంది.
వేయి ప్రయత్నాలు చేస్తే 999 విఫలం అన్నట్లుంటుంది జీవితం. అటు వృత్తిలో అయినా, ఇటు వ్యాపారంలో అయినా విజయం ఎండమావే అవుతుంటుంది.
తూర్పు ఆగ్నేయ వీధిపోటున్న ఇంటిని, స్థలాన్ని కొనకూడదు.
వీధిపోట్లు పట్ల నిర్లక్ష్యం :
వాస్తుశాస్త్రం రీత్యా వీధిపోట్లు విషయంలో చాలాచాలా అప్రమత్తంగా ఉండాలి.
సుఖశాంతుల్ని, జీవితంలో సెక్సెస్‌లను మింగేసి, అశాంతిని మిగిలించే వీధిపోట్లు ఉన్నా ఇళ్ళు, స్థలాలు, వ్యాపార దుకాణాలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
శాస్త్రాన్ని, శాస్త్ర సూచనలను నిర్లక్ష్యం చేసి... కోరి కలతల్ని కొని తెచ్చుకోవడం మంచిది కాదు.