ఇహపరమైన జంజాటం నుంచి బయటపడటానికి మనుషులు తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. కనీసం ఆ సమయంలోనైనా భగవంతుడి మీద మనసు లగ్నం చేయగలనని, చేయాలని ఓ చిరు ఆశ. చింతలు వీడి ఆ దేవదేవుడి చింతన చేసే ప్రయత్నమే తీర్థయాత్ర.
పుణ్యనదుల్లో స్నానం చేయటం, ఆ ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించటమే తీర్థయాత్రల ముఖ్యోద్దేశం. పుణ్యనదుల్లో స్నానాలు, ఆలయ సందర్శనలు మనిషి మనసు మీద ప్రభావం చూపుతాయి. ప్రశాంతతను, స్థిరచిత్తాన్ని కలిగిస్తాయి. మనసును ఆధ్యాత్మికపథం వైపు పయనింపజేస్తాయి.
తీర్థయాత్రకు అసలైన అర్థం మనిషి తనలోకి తాను పయనించడం, తనలోకి తాను చూడగలగటం. బుద్ధిని, మనసును ఆధ్యాత్మిక చేతన, చింతనలోకి ప్రవేశించేటట్లు చేయగలగటం. ఆ స్థితి ఏర్పడిననాడు భగవంతుణ్ని మనలోనే చూడగలం. అలా చూడగలిగిన ప్రతిసారీ ఓ తీర్థయాత్రను పూర్తిచేసినట్లే.
ఆధ్యాత్మిక చింతన మనిషి మనసు నుంచే ప్రారంభం కావాలి. అందుకే మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. నైతిక ప్రవర్తనతో, ధర్మబద్ధమైన జీవితాన్ని సాగించాలి. అప్పుడు ఆ నిర్మలమైన మనసు నుంచి వచ్చే మాట, మనోప్రేరితమై చేసే పనుల్లో ఓ ఏకీభావం ఒనగూడుతుంది.
ఆధ్యాత్మిక_మార్గం లో ప్రయాణం ప్రారంభించిన వ్యక్తికి తాను నమ్ముకున్న మార్గాన్ని మరింత బలపరిచే అనుభవాలు అవసరమవుతాయి.
అటువంటి అనుభవం కోసం కొన్ని ప్రాంతాలను, వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా వెతుక్కుంటూ వెళ్ళటమే తీర్థయాత్ర.
గతంలో ప్రజలు మునీశ్వరుల దగ్గరకు వెళ్ళి తమ సందేహాలను తీర్చుకునేవారు. ఆ మహానుభావులున్న ప్రదేశాలే #పుణ్యక్షేత్రాలు అయ్యాయి.
అటువంటి శక్తి ప్రతిష్ఠించిన దేవతామూర్తుల ద్వారా లభిస్తుంది. ఆ విశేష స్థల పురాణం కలిగిన పుణ్యక్షేత్రాలను దర్శించటం వల్ల మానవుల మనసులో మార్పు వస్తుంది. మారిన మనసు మనిషికి ప్రశాంతతను చేకూరుస్తుంది.
పుణ్యక్షేత్రాల సందర్శన మనస్సుకు ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు వ్యాపారాభివృద్ధి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.