వైశంపాయనుడు తన బంధువులను చూడవలెనని పట్టుబట్టిన ధర్మరాజు కోరికను ఇంద్రుడు మన్నించాడు. వెంటనే ఒక దూతను పిలిచి ఈయన ధర్మరాజు. ఈయనకు తన వారిని చూడాలని కోరికగా ఉంది. నీవు ఈయనను తీసుకు వెళ్ళి ఆయన బంధువులను అందరినీ చూపించు. ఆ దేవదూత ధర్మరాజును తన వెంట తీసుకువెళ్ళాడు. ధర్మరాజు వెంట నారదుడు, దేవఋషులు కూడా వెళ్ళారు. ముందుగా వారు పెద్ద సింహాసనము మీద కూర్చున్న సుయోధనుడు కనిపించాడు. ఆయన చుట్టూ దేవకాంతలు సేవలు చేస్తున్నారు. సుయోధనుడు అంతులేని సుఖాలు అనుభవిస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు దేవమునులతో దేవమునులారా ! ఈ సుయోధనుడు పరమ లోభి. ఇతడికి ముందు చూపు లేదు. అనేక దేశములు ఏలే రాజులను యుద్ధముకు పిలిపించి వారి రధ, గజ, తురంగ, కాల్బలములతో సహా మరణించేలా చేసాడు. రాజసూయ యాగము చేసి పవిత్రురాలైన ద్రౌపదిని నిండు కొలువుకు ఈడ్చుకు వచ్చి ఘోరముగా అవమానించాడు. అలాంటి వాడు స్వర్గసుఖాలు అనుభవిస్తునాడు. వీడితో చేరి నేను స్వర్గసుఖాలు అనుభవించాలా ! వీలులేదు నన్ను నా తమ్ములు భీమార్జున నకుల సహదేవులు ఉన్నచోటికి తీసుకు వెళ్ళండి అని వెనకకు తిరిగాడు.