ధృతరాష్ట్రుడి వారసులలో యుయుత్సుడు ఒక్కడే మిగిలాడు. ధర్మరాజు యుయుత్సుడిని కురుసామ్రాజ్యానికి పట్టభిషిక్తుడిని చేసాడు. పరిక్షిత్తుని యువరాజుగా పట్టభిషిక్తుడిని చేసాడు. యుయుత్సుడికి రాజ్యపాలన గురించిన విషయములు అన్నీ వివరించాడు. తరువాత సుభద్రతో అమ్మా సుభద్రా ! ఈ భరత సామ్రాజ్యానికి నీ మనుమడు ఉత్తరాధికారి అయ్యాడు. శ్రీకృష్ణుడి మనమడు వజృడు ఇంద్రప్రస్థానికి రాజు అయ్యాడు. ఈ విధముగా కురువంశము, యాదవవంశము వర్ధిల్లుతాయి. ఈ రెండు వంశాలను నీవే రక్షించాలి అని సుభద్రను రెండు వంశాలకు సంరక్షకురాలిగా నియమించాడు. తరువాత భారతయుద్ధములో మరణించిన వీరుల కుటుంబాలకు అగ్రహారాలు, గ్రామాలు, ధనము ఇచ్చి వారి పోషణకు తగు ఏర్పాట్లు చేసాడు. బ్రాహ్మణులకు గోదానములు, భూదానములు, సువర్ణ దానములు విరివిగా చేసాడు. పరీక్షిత్తును కృపాచార్యుడికి శిష్యుడిగా అప్పగించాడు. తరువాత హస్థినాపురప్రజలతో ఒక సభ ఏర్పాటు చేసాడు.